December 26, 2025
తాజా వార్తలు

‘తల్లికి వందనం’ , రైతు భరోసా అమలు ఇలా – ప్రభుత్వం తాజా నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ హామీల పైన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలవుతోంది. ఇక, తల్లికి వందనం.. అన్నదాత సుఖీభవ అమలు పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 28న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ రెండు పథకాలకు నిధుల కేటాయింపుతో పాటుగా అర్హతల మార్గదర్శకాల పైన విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బడ్జెట్ కసరత్తు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తారు. ఆ తరువాత సభ వాయిదా పడుతుంది. మర్నాడు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై చర్చ చేపడతారు. 26,27 తేదీలు సెలవు దినాలు. 28న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఈ సారి బడ్జెట్ లో సంక్షేమం – అభివృద్ధి కి ప్రాధాన్యత ఇచ్చేలా కేటాయింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

బడ్జెట్ లో కేటాయింపులు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కోసం నిధులు కేటాయించనున్నారు. జూన్ లో తల్లికి వందనం, జూలైలో అన్నదాత సుఖీభవ అమలుకు ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఉగాది నుంచి అమలు చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ, ఇప్పుడు ఈ పథకం అమలు లో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక.. తల్లికి వందనం అమల్లో భాగంగా అంచనాలను అధికారులు సిద్దం చేసారు. ఎంత మంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి రూ 15 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో వేసేలా ఇచ్చిన హామీ అమలు పైన బడ్జెట్ లో ప్రతిపాదనలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పథకాలు – నిధులు తల్లికి వందనం పథకం కోసం తాజా లెక్కల మేరకు 69.16 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. వీరికి పథకం అమలు చేయాలంటే దాదాపు రూ 10,300 కోట్లు అవసరమని తేల్చారు. అర్హతల ఖరారు పైన తుది కసరత్తు కొనసాగుతోంది. ఇక, ప్రతీ రైతుకు ఏటా ఇస్తామని చెప్పిన హామీ మేరకు రూ 20 వేలు ఇచ్చేలా హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ కోసం రాష్ట్రంలో అర్హత ఉన్న రైతుల సంఖ్య 53.58 లక్షలుగా గుర్తించారు. ఒక్కో రైతుకు రూ 20 వేలు చొప్పున చెల్లించేందుకు కావాల్ సిన మొత్తం రూ 10,717 కోట్లు. కాగా, పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే ఆరు వేలు మినహాయింపు చేయనున్నారు. ఈ లెక్కన ఒక్కో రైతుకు ఏడాదికి రూ 14 వేలు చొప్పున చెల్లిస్తే ఇందు కోసం రూ 14 వేల చొప్పున ఇస్తే కావాల్సిన మొత్తం 7,502 కోట్లు కావాలని తేల్చారు. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. నిరుద్యోగ భృతి పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది స్పష్టత రావాల్సి ఉంది.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video