August 30, 2025
రాజకీయం

“కేంద్ర”బిందువుగా నాగబాబు

మంత్రివర్గంలోకి జనసేన నేత

ఎంపిక ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ!

జనసేన శ్రేణుల్లో జోష్.

నర్సాపురం:- కొణిదల నాగేంద్రబాబు ఇద్దరు సినీ దిగ్గజ కథానాయకులకు సోదరుడు, జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ. ప్రస్తుతం నాగబాబు కోసం ఇంత చర్చ ఎందుకు అనుకుంటున్నారా. అయితే ఇది పూర్తిగా చదవాల్సిందే… గడిచిన ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నుంచి జనసేన పార్టీ తరపున బరిలో నిలిచేందుకు నాగబాబు సిద్ధమయ్యారు. అయితే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లో భాగంగా ఈ స్థానాన్ని బిజెపి దక్కించుకొని సీఎం రమేష్ కు సీట్ కేటాయించింది. చివరి నిమిషంలో సీటు చేజారినప్పటికీ నాగబాబు ఎక్కడ అసంతృప్తి చెందకుండా కూటమి పార్టీ అభ్యర్థుల విజయానికి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి తెర ముందు తెర వెనుక అభ్యర్థుల విజయానికి విశేష కృషి చేశారు. సోదరుడు పవన్ ఆదేశాలతో అంకితభావంతో పనిచేశారు. రాష్ట్ర మంత్రివర్గంలోకి మొదట నాగబాబు ను తీసుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి అయితే ఆయన ఏ సభలోను సభ్యుడు కాకపోవడంతో అప్పట్లో ఈ నిర్ణయం వాయిదా పడింది. అనంతరం రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయడంతో ఒక స్థానం జనసేనకు దక్కింది. జనసేన పార్టీ ఏర్పడిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ వెంటే నిలిచిన పిడుగు హరిప్రసాద్ కు ఈ స్థానాన్ని జనసేనని కట్టబెట్టారు. నాగబాబుకు దక్కవలసిన ఈ ఎమ్మెల్సీ సీటు కూడా చివరి క్షణంలో మిస్సయిందనే ప్రచారం జోరుగా సాగింది. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంలోనికి నాగబాబును తీసుకుంటున్నట్లు ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం, నాగబాబుకు పదవి వారసత్వం కాదని అది అతని సమర్థత అని జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం గమనార్హం. దీంతో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో నాగబాబు ఒక స్థానాన్ని దక్కించుకొని రాష్ట్ర మంత్రి అవటం ఖాయమని అంతా భావిస్తున్నారు. అయితే శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్, పార్టీ జనరల్ సెక్రెటరీ విజయసాయిరెడ్డి స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాను స్పీకర్ కు సమర్పించారు. దీంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. విజయసాయి రాజీనామా ఆమోదం పొందిన తరువాత ఆ స్థానం నుంచి నాగబాబును రాజ్యసభకు పంపాలని తద్వారా కేంద్ర మంత్రివర్గంలోకి నాగబాబుని తీసుకొనేలా చేయాలని చంద్రబాబు, పవన్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కూటమి పార్టీలైన తెలుగుదేశం, బిజెపి కేంద్ర మంత్రివర్గంలో స్థానాలు దక్కించుకున్నాయి. జనసేన పార్టీకి కాకినాడ, మచిలీపట్నం రెండు ఎంపీ స్థానాలు ఉన్నప్పటికీ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పార్టీ అయిన జనసేనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా క్షత్రియ, కమ్మ, బీసీ వర్గాల నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, కింజరపు రామ్మోహన్ నాయుడులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపు సామాజిక వర్గానికి కేంద్రంలో చోటు దక్కలేదని అసంతృప్తి ఉంది. ఈ పరిణామాలన్నిటి దృశ్య నాగబాబును కేంద్ర మంత్రివర్గంలోకి పంపడం ద్వారా కూటమి పార్టీల ఐక్యత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్నేహ సంబంధాలు, సామాజిక సమీకరణాలు మొదలగు విషయాలకు ఆసరాగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. అంతేకాకుండా భవిష్యత్తులో రాష్ట్ర మంత్రిగా ఉన్న టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను రాష్ట్ర రెండవ ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించినప్పటికీ పదవుల పంపకంలో సమతుల్యత దెబ్బ తినకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉన్నట్లు సమాచారం.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video